Home  »  Bollywood News  »  'ఆపరేషన్ స‌ఫేద్‌ సాగర్' వెబ్ సిరీస్‌పై వివాదం.. బ్యాన్ చేయాలంటూ నెటిజన్ల డిమాండ్!

Updated : Aug 12, 2026

వర్సటైల్ నటుడు సిద్ధార్థ్, బాలీవుడ్ నటులు జిమ్మీ షేర్ గిల్, దియా మీర్జా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ 'ఆపరేషన్ స‌ఫేద్‌ సాగర్'. ప్రముఖ దర్శకుడు ఓని సేన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా సిరీస్ ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే విడుదలైన కొద్దిరోజులకే ఈ ప్రాజెక్ట్ ఒక అనూహ్యమైన వివాదంలో చిక్కుకుంది.

1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం (IAF) ప్రదర్శించిన వీరోచిత పోరాట ఘట్టాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. కథ రీత్యా ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగుతున్నప్పటికీ, ఇందులో చూపించిన ఒక సన్నివేశంపై ఇప్పుడు సైనిక వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సిరీస్‌లో అమరవీరుడైన స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా పాత్రను సిద్ధార్థ్ పోషించారు. ఆయన భౌతికకాయాన్ని మోసుకెళ్లే సన్నివేశంలో పేటికపై కప్పిన భారత జాతీయ జెండా అమరిక నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ శౌర్య చక్ర గ్రహీత, ఆర్మీ మాజీ కల్నల్ వేంబు శంకర్ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. నేషనల్ ఫ్లాగ్ కోడ్ ప్రకారం కాషాయ రంగు తల వైపు ఉండాల్సి ఉండగా, ఆ సీన్‌లో తలకిందులుగా ఉంచారని ఆధారాలతో సహా ఎత్తిచూపారు.

జాతీయ పతాక గౌరవానికి సంబంధించిన ఈ పొరపాటును డిజిటల్‌గా వెంటనే సరిదిద్దాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా సైనిక గౌరవాలను విస్మరించినందుకు మేకర్స్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేశారు.

గతంలో 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి సూపర్ హిట్ లవ్ స్టోరీలతో మెప్పించిన సిద్ధార్థ్, ఈ మధ్యకాలంలో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ఓటీటీ స్పేస్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నారు. ఇలాంటి దేశభక్తి నేపథ్యం ఉన్న పాత్రలో సిద్ధార్థ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నప్పటికీ, మేకర్స్ చేసిన సాంకేతిక పొరపాటు నెగెటివ్ టాక్‌కు కారణమైంది.

ప్రస్తుతం ఆర్మీ మాజీ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జాతీయ పతాక నిబంధనలను ఉల్లంఘించడాన్ని తప్పుబడుతూ అనేకమంది నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. సైనిక వీరుల త్యాగాలను తెరపై ఆవిష్కరించేటప్పుడు మేకర్స్ మరింత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వివాదంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం మరియు 'ఆపరేషన్ స‌ఫేద్‌ సాగర్' చిత్రబృందం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. త్వరలోనే ఈ సన్నివేశాన్ని రీ-ఎడిట్ చేసి వివాదానికి తెరదించుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.